Best School

భూమి అంతర్గత నిర్మాణం

భూమి అంతర్గత నిర్మాణం

Location: సాఘిక శాస్త్రం

released: 2019-12-15 16:38:10

Description

భూమిని మూడు పొరలుగా విభజించవచ్చు. భూపటలం, భూప్రావారము, భూ కేంద్ర మండలము 1. భూపటలం:- మనం భూమి బయటిపొర మీద నివసిస్తున్నాం. దీనిని భూపటలం అంటాం. ఈ పొర ఉపరితలం నుండి 100 కి.మీ. వరకు ఉంటుంది. ఈ పై పొరలో వివిధ రకాల రాళ్ళు ఉంటాయి. 2. భూప్రవారము:- ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూప్రావారంలో పైభాగం మెత్తగా ఉంటుంది, దీనిపై పైపొర తేలుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి. 3. భూ కేంద్ర మండలం:- ఇది 2900 కిలోమీటర్ల నుంచి మొదలుకుని 6,376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార, ఘన పదార్థాలు ఉంటాయి. దీనిని తిరిగి రెండు ఉపపొరలుగా విభజించవచ్చు. బయటి కేంద్ర భాగం: 2,900 కిలోమీటర్ల నుంచి 5,100 కిలోమీటర్ల వరకు ఉండే ఈ పొరలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. లోపలి కేంద్ర భాగం: ఘనరూపంలో ఉండే ఈ లోపలి భాగం 5,100 నుంచి 6,376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో ఇనుము లోహమిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి. కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాలనుండి సముద్ర తలంలోని పగుళ్ల నుండి పైకి వచ్చి, చల్లబడి భూమి పై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్యపొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది. ఈ విధంగా భూపటలం నిత్యం ఏర్పడుతూ, నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండలు పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పైపొర నిత్యం మారుతూనే ఉంది. • భూమి ఘన పరిమాణంలో భూపటలం1% మాత్రమే,అయితే భూప్రావారం16%, భూ కేంద్ర మండలం 83% ఉంటుంది. భూమి కోడిగుడ్డు అంత ఉందని అనుకుంటే, భూపటలం కోడిగుడ్డు పెంకు అంత మందంగా ఉంటుంది! 20వ శతాబ్ది ఆరంభంలో జర్మనీకి చెందిన వాతావరణ, భూ భౌతిక శాస్త్రవేత్త అయిన ఆల్ఫైడ్ వెజినర్ ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 220 మిలియన్ సంవత్సరాల క్రితం 'పాంజియా' (గ్రీకులో ఈ పదానికి 'మొత్తం భూమి' అని అర్థం) అనే మహా ఖండం ఉందని అతను ప్రతిపాదించాడు.