Best School

భూమి-ఆవరణములు

భూమి-ఆవరణములు

Location: సాంఘిక శాస్త్రం

released: 2019-12-18 15:56:27

Description

భూమి మీద నాలుగు ఆవరణములు ఉంటాయి. ఇవి: 1. శిలావరణం, 2. జలావరణం, 3. వాతావరణం, 4. జీవావరణం. 1. శిలావరణం : భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పైపొర ఇది. దీంట్లో రాళ్లు ఇ, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది. ఈ ఆవరణాన్ని ఇంగ్లీషులో “లితోస్పియర్' అంటారు. ('లితో” అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం. 'స్పేయిరా' అంటే గోళం లేదా బంతి అని అర్థం). అనగా ఈ పొర చదునుగా ఉండే ఉపరితలం కాదు. ఎత్తైన కొండలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, లోయలు, నీటితో నిండిన లోతైన అగాథాలు (మహాసముద్రాలు) వంటివి ఈ ఆవరణంలో ఉంటాయి. వీటిల్లో పలు అంశాలు గాలి, నీటి ప్రభావాల వల్ల రూపుదిద్దుకున్నాయి. ఈ పైపొరలోని కొంత భాగం దుమ్మువంటి వాటి రూపంలో గాలిలో కలిసి ఉంటుంది. సూర్యకిరణాలకు ఈ శిలావరణం వేడెక్కినప్పుడు, ఆ తరవాత చల్లబడినప్పుడు అది గాలినీ, నీటినీ ప్రభావితం చేస్తుంది. అనేక ఇతర జీవులు, మనం ఈ మండలంపై నివసిస్తున్నాం. ఈ గట్టిపొరలో ఉండే రాళ్లనీ, మట్టినీ, ఇతర వస్తువులనీ అనేక రకాలుగా ఉపయోగించుకుంటాం. 2. జలావరణం : నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు. ఇంగ్లీషులో దీనిని ‘హైడ్రోస్పియర్' అంటారు. (ఇది నీరు అనే అర్థం ఉన్న ‘హ్యుడర్' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది). వివిధ రకాలుగా వచ్చిన నీళ్లు, నదులు, చెరువులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి జలాశయాలు దీనిలో ఉంటాయి. నీటిలో కొంతభాగం భూమి లోపలిపొరల్లో రాళ్లమధ్య (భూగర్భజలం) ఉంటుంది. 3. వాతావరణం : భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. ఇంగ్లీషులో దీనిని 'అట్మాస్ఫియర్' అంటారు. ('అట్మాస్' అన్న గ్రీకు పదానికి 'ఆవిరి' అని అర్థం). ఈ మండలంలో ప్రాణవాయువు, నత్రజని, బొగ్గుపులుసు వాయువు, నీటి ఆవిరి వంటి అనేక వాయువులుంటాయి, ధూళి కణాలు కూడా ఉంటాయి. 4. జీవావరణం : గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాలలో ఎంతో లోతున ఉండే ప్రాణులు, బాక్టీరియాతోసహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. ఇంగ్లీషులో దీనిని 'బయోస్ఫియర్' అంటారు. (జీవం అన్న అర్థం ఉన్న 'బయోస్' అనే గ్రీకు పదంనుంచి ఇది వచ్చింది). మీరు పైన గమనించినట్టు జీవానికి పై మూడు ఆవరణాలు - నేల, నీరు, గాలి కావాలి. ఈ మూడు ఉన్న చోట జీవం వర్ధిల్లుతుంది. అంటే మూడు 'సహజ' ఆవరణాలు కలిసినచోట జీవం ఉంటుంది. జీవం తిరిగి ఈ మూడు మండలాలను ప్రభావితం చేస్తుంది. అగ్ని పర్వతాలు : భూగర్భములోని శిలాద్రవం అనుకూల పరిస్థితులలో భూపటలంలోని రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. బయటకు ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనిని అగ్ని పర్వతం అంటారు. కరిగిన పదార్థంతోపాటు భూమిలోపల పొరల్లోంచి నీటిఆవిరి, పొగ, అనేకరకాల వాయువులు బయటికి వచ్చి వాతావరణంలో కలుస్తాయి. కరిగిన పదార్థం చల్లబడి కఠిన శిలలుగా ఏర్పడుతుంది. వీటిని అగ్నిశిలలు అంటారు. ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు స్ట్రాంబోలి - సిసిలీ మౌంట్ పీలే - వెస్ట్ ఇండీస్ మౌంట్ వెసువియస్ - ఇటలీ ఫుజియామా - జపాన్ కోటోపాక్సి - ఈక్వేడార్ మాయన్ - ఫిలిప్పీన్స్ బారెన్, నార్కొండం - ఇండియా కిలిమంజారో - టాంజానియా పెద్దశిలలు చిన్నశిలలుగా అవుతాయి. ఈ చిన్నశిలలు మాతృశిల నుంచి వేరుపడి కిందకి కొట్టుకువెళ్లి మేట వేస్తాయి. ఈ ప్రక్రియను సాధారణంగా ఇలా వివరిస్తారు: i) శిలా శైథిల్యం : వాతావరణ శక్తుల వల్ల శిలలు విచ్చిన్నమయ్యే ప్రక్రియ ఇది. శిలలు వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి, చల్లబడినప్పుడు సంకోచిస్తాయి. ఇది ప్రతి పగలూ, రాత్రీ; వేసవి, శీతాకాలాల్లో సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది. పైన ఉన్న శిలలు సంకోచించి, వ్యాకోచించి, తిరిగి సంకోచిస్తూ ఉండటం వల్ల అవి పెళుసుగా మారి ముక్కలవుతాయి. నీళ్లు, గాలిలోని తేమకూడా ఈ ప్రక్రియకు దోహదం చేస్తుంది. శిలలలోని రసాయనాలతో నీళ్లు ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరుస్తాయి. శిలలు బలహీనమై, పగిలిపోయే ఈ ప్రక్రియను 'శిలాశైథిల్యం' (weathering) అంటారు. ii) క్రమక్షయం : ప్రవహిస్తున్న నీటికి, గాలికి ఎంతో శక్తి ఉంటుంది. అది శిలలను నిదానంగా కరిగించి వేస్తుంది, మట్టి పైపొరలను తొలగించి వేస్తుంది. వాన, నది, ప్రవహిస్తున్న భూగర్భజలం, సముద్ర అలలు, హిమానీనదాలు (గ్లేసియర్) వంటి అనేక రూపాలలో నీళ్లు ప్రభావం చూపుతాయి. గాలి కూడా స్థిరమైన గాలులు, ఈదురుగాలులు, తుఫాను గాలులు వంటి అనేక రూపాలను తీసుకుంటుంది. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పైపొరలు కొట్టుకుపోవటాన్ని క్రమక్షయం అని అంటారు. ii) రవాణా : కోతకు గురైన శిలల, కంకర, మట్టి, వండ్రు వంటి వాటిని గాలి, నీళ్లు మోసుకు పోవటాన్ని రవాణా అంటారు. నదులు, గాలులు, అలలు కూడా శిలలను, మట్టిని కోతకు గురిచేసి దూరప్రాంతాలకు తీసుకెళతాయి - ఒక్కొక్కసారి వందల కిలోమీటర్ల దూరం తీసుకెళతాయి. iv) నిక్షేపణ : శిలలనుంచి, పైపొరల నుంచి విడిపోయిన రేణువులు గాలి, నీటితోపాటు కొట్టుకు పోతుంటాయి. అయితే వీటి వేగం తగ్గినప్పుడు ఇక రేణువులను మోసుకు వెళ్లలేక వాటిని మేట వేస్తాయి(వదిలేస్తాయి). ఇలా మేట వేసిన మట్టివల్ల మైదాన ప్రాంతాలు, నదీ ప్రాంతాలు ఏర్పడతాయి. కోతకు గురైన దాంట్లో చాలావరకు నదుల ద్వారా సముద్రాలకు చేరుతుంది. సముద్రపు నేలలో ఇది పొరలు పొరలుగా నిక్షేపమై కాలక్రమంలో ‘అవక్షేపశిలలు' (sedimentary rocks)గా మారతాయి. నీటి ప్రభావం :- ఎత్తైన పర్వతాలలో నది పుట్టిన చోటునుంచే దాన్ని ప్రభావం మొదలవుతుంది. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నదీప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురి చేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయ ఏర్పడుతుంది - ఇది కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటుంది. దీనిని సాధారణంగా V ఆకారపు లోయ అంటారు. ఈ దశలో నీటికి చాలా శక్తి ఉండి గట్టిగా ఉండే బరువైన రాళ్లను సైతం తరలించుకు పోగలదు. ప్రపంచంలో అతి పెద్ద అగాధధరి అయిన గ్రాండ్ కాన్యన్' కొలొరాడో నదిమీద ఉంది. దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్లు, వెడల్పు 188 మీటర్లనుంచి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రాళ్ళు (శిలలు) చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటిని 'గార్జెస్' అంటారు. వీటికి ఉదాహరణలు గోదావరి నది మీద పాపికొండల వద్ద బైసన్ గార్జ్, కాశ్మీరులోని ఇండస్ గార్జ్. నదీ నీటి కోతకు మరొక ముఖ్యమైన రూపం 'అగాధధరి' అంటారు. దీంట్లో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురవుతాయి. గార్జ్ పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా అగాధధరిలో కింద కంటే పైభాగం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఎంజెల్ జలపాతం. ఇది వెనిజులాలోని చురుణ్ నదిపై ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు. రెండవ అతి ఎత్తైన జలపాతం టుగెలా జలపాతం. ఇది దక్షిణ ఆఫ్రికాలో అదే పేరుమీద ఉన్న నది మీద ఉంది. ఈ జలపాతం ఎత్తు 947 మీటర్లు. భారత దేశంలో అతి ఎత్తైన జలపాతం జోగ్, లేదా జెరొసొప్పా జలపాతం. దీని ఎత్తు 253 మీటర్లు. ఇది కర్నాటకలోని శరావతి నదిపై ఉంది. ప్రపంచంలో అతి పెద్ద డెల్టా సుందర్బన్. గంగ, బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఇది ఏర్పడింది.